DHANYAPURAASHI (Kavi Lekhalu) by [Thagulla Gopal]
ఈ పంట మీ చేతుల్లో...
నా జీవితంలో ఈ మూడేళ్ల 'కవిలేఖల' కాలం( 2020-2023) మరువలేనిది. ఎంతో మంది కవులను చదవడానికి, వాళ్ళ కవిత్వ తత్త్వాన్ని అర్థం చేసుకోవడానికి ముఖ్యంగా నా అధ్యయనానికి, నా వచనానికి పాదులు తీసింది ఈ కవిలేఖ. నిజంగా ఈ మూడేళ్ళు ఎట్లా గడిచిపోయినవో తెల్వదు. కవి జీవితాన్ని, కవిత్వ నేపథ్యాన్ని, వాళ్ళతో నాకుండే అనుబంధాన్ని లేఖలో చెబుతే బాగుండు అని అనుకున్నాను. దీనికి ప్రేరణ శిలాలోలితమ్మ 'వర్తమాన లేఖ', దర్భశయనం సార్ 'పలకరింపు' ఉత్తరాలు, హాయిగా, ఏ ఇబ్బంది లేకుండా లేఖారూపంలో అభిప్రాయాలను చెప్పొచ్చు అనుకున్న గాని లేఖలు రాస్తుంటే చాలా శ్రమ పడాల్సి వచ్చింది. కవితో ఉండే అనుబంధంతో పాటు వాళ్ళ సాహిత్యం మీద విశ్లేషణాత్మకంగా రాయడం వలన ఒక్కోసారి రాత్రి ఒంటి గంట దాక రాసి, టైపు చేసి ఉదయం నాలుగింటికి లేచి మళ్ళి రాసిన రోజులున్నవి. కానీ అవే ఇప్పుడు సజీవ జ్ఞాపకాలు, కవిలేఖలు రాసినన్ని రోజులు కవిత్వం ఎక్కువగా రాయలేకపోయాను గానీ ప్రతి లేఖ కూడా నాకు కవిత్వమే.
- తగుళ్ళ గోపాల్